Jamili Elections: జమిలి బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందాలంటే...! 10 d ago
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందుకోసం ఒకే దేశం..ఒకే ఎన్నిక నినాదంతో ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర క్యాబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం జమిలి బిల్లు ప్రవేశపెట్టనుంది. లోక్సభ ఎంపీలకు బీజేపీ అధిష్ఠానం విప్ జారీ చేసింది. ఈ నెల13,14న సమావేశాలకు తప్పక హాజరుకావాలని ఆదేశించింది. ఉభయసభల్లో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
రాబోయే సాధారణ ఎన్నికలు జమిలీగానే జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మoగా అడుగులు వేస్తున్నారు. కానీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలకు కూటమి ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం లేదు. అయినప్పటికీ ఈ బిల్లును ఆమోదించేందుకు ముందుకెళ్లాలని ప్రధాని భావిస్తున్నారు. ఒక దేశం ఒక ఎన్నిక విధానం కోసం రూపొందించిన బిల్లు రాజ్యాంగ సవరణలతో ముడిపడిన అంశం కాబట్టి ఉభయ సభల్లోనూ మూడింట రెండో వంతు మెజార్టీ కచ్చితంగా అవసరం ఉంది.
రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉంటే..కనీసం 164 ఓట్లు పడాలి.
అలాగే లోక్ సభలో 545 మంది సభ్యులు ఉంటే 364 ఓట్లు రావాలి.
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సాధారణ మెజారిటీతోనే నడుస్తుంది కాబట్టి, ఓటింగ్ సమయానికల్లా మూడింట రెండో వంతు మెజార్టీ మద్దతు సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జమిలి ఎన్నికలకు మొత్తం 47 పార్టీలలో 32 పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. అంతే 15 రాజకీయ పార్టీలు ఈ బిల్లును వితరేకించాయి.
2027లోపే సగం రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయి..!
2025 లో ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. 2026లో అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయి. 2027లో ఈ స్టేట్స్ ఎన్నికల సమయంలోనే దేశమంతటా జమిలి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది.
త్రిపుర, మేఘాలయ, నాగాల్యాండ్, కర్ణాటక, మిజోరాo, చతిస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలలో సాధారణ ఎన్నికలు 2028లో జరగాల్సి ఉండగా..జమిలి బిల్లుకు ఆమోదం లభిస్తే 2027లో ఎన్నికలు జరుగుతాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్రలో సాధారణ ఎన్నికలు 2029లో జరగాల్సి ఉండగా.. .జమిలి బిల్లుకు ఆమోదం లభిస్తే 2027లో ఎన్నికలు జరుగుతాయి.